అది ఇటలీ ఐఎన్డీఐఏ కూటమి, సనాతన ధర్మాన్ని కించపర్చినోళ్లంతా సమాధులయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై నిజమైన నిఖార్సైన హిందువని చెప్పుకున్న కేసీఆర్ ఎందుకు స్పందించరు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. అంతేకాకుండా.. రాజాసింగ్, నుపూర్ శర్మ వ్యాఖ్యలపై మొరిగిన గళాలు ఉదయనిధి విషయంలో ఎందుకు మూతపడ్డాయ్? సనాతన ధర్మంపై కరుణానిధి మనవడు, సోనియా కొడుకు చెబితే వినాల్సిన ఖర్మ భారతీయులకు పట్టలేదు. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.
ఐఎన్డీఐఏ కూటమిలోని పార్టీలు దీనిపై ఎందుకు స్పందించలేదు? హిందూ ధర్మాన్ని కించపర్చడం, హిందువులను హేళన చేయడమే ఐఎన్డీఐఏ కూటమి ఎజెండాగా కన్పిస్తోంది. ఈ కూటమి ఒక్కటి గుర్తుంచుకోవాలి… సనాతన ధర్మాన్ని అంతమొందించాలని కుట్ర చేసినోళ్లంతా సమాధుల్లో ఉన్నారు. ఛత్రపతి శివాజీ వారసుల జోలికొస్తే ఔరంగజేబు నుండి బ్రిటీష్ వాళ్ల వరకు అందరూ అంతమైపోయిన విషయాన్ని కుహానా లౌకిక వాళ్లంతా ఆలోచించుకోవాలి. సోనియాగాంధీ కొడుకైనా, స్టాలిన్ కొడుకైనా సరే…సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తే తీవ్రమైన పరిణామాలుంటాయి. గతంలో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని నుపూర్ శర్మను, రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తే సంకలు గుద్దుకున్న ఈ ఐఎన్డీఐఏ కూటమి భాగస్వామ్య పార్టీల నోళ్లు ఉదయనిధి స్టాలిన్ విషయంలో ఎందుకు మూతపడ్డయ్. దీనిద్వారా అర్ధమవుతున్నదేమిటంటే.. అది నిజమైన ఇండియా కూటమి కాదు… ఇటలీ ఐఎన్డీఐఏ కూటమి అని అర్ధమవుతోంది. ఇప్పటికైనా ఆ కూటమి భాగస్వామ్యపక్షాలు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించాలి. లేనిపక్షంలో హిందూ ద్రోహులుగా గుర్తించకతప్పదు. ఉదయనిధి స్టాలిన్ వంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని హిందూ సమాజాన్ని కోరుతున్నా.’ అని బండి సంజయ్ ప్రకటనను విడుదల చేశారు.