Leading News Portal in Telugu

Hyderabad Metro: ఎయిర్‌పోర్ట్ మెట్రోపై అప్డేట్.. వచ్చే వారం పనులు ప్రారంభమయ్యే ఛాన్స్


Hyderabad Metro: విశ్వనగరంలో ఇప్పటికే కొత్త ఫ్లై ఓవర్లు, వంతెనలు, రోడ్లు నిర్మించారు. అదే సమయంలో, పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ప్రజా రవాణాను ఊహించని విధంగా మెరుగుపరచాలని నిర్ణయించింది. నగరంలోని అన్ని ప్రాంతాలకు మెట్రోను పొడిగిస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులో ఉండగా.. ఎయిర్‌పోర్ట్‌ మెట్రో టెండర్‌ దశలో ఉంది. విమానాశ్రయం మెట్రో రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కి.మీ. గతేడాది డిసెంబర్‌లో ఈ పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.6250 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో పనులకు ఈపీసీ పద్ధతిలో గ్లోబల్ టెండర్లు ఆహ్వానించారు. రెండు కంపెనీలు టెండర్లు దాఖలు చేయగా ఎల్‌1గా నిలిచిన కంపెనీ వివరాలతో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ఆమోదం అనంతరం టెండర్లు వేసిన కంపెనీ ఎయిర్‌పోర్టు మెట్రో పనులు చేపడుతుంది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినప్పటికీ కేంద్రం నుంచి కూడా సూత్రప్రాయ ఆమోదం అవసరం. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

Read also: Fair Accident: రాజేంద్రనగర్ లో అగ్నిప్రమాదం.. వారంలో ఇది రెండోసారి

టెండర్ దక్కించుకున్న కంపెనీని రెండు మూడు రోజుల్లో ప్రకటించి వచ్చే వారం క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారం పనులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లోనే ఎక్స్‌ప్రెస్ మెట్రో డిపోను నిర్మించనున్నారు. ఇందుకోసం అవసరమైన 48 ఎకరాలను జీఎంఆర్‌ తాజాగా మెట్రో రైలుకు అప్పగించింది. ముందుగా సెప్టెంబర్ 13ని డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన ముగియడంతో ఈ తొలిదశ పనులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకమైన సైక్లింగ్‌ ట్రాక్‌ ప్రారంభోత్సవం, ఎయిర్‌పోర్టు మెట్రో పనుల ప్రారంభోత్సవం ఈ నెలలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయంతో నగరానికి మెట్రో కనెక్టివిటీ ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను పొడిగించాలని గతంలో ఆయన సూచించారు. ఈ మేరకు 2018-19లో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) డీపీఆర్‌ను రూపొందించింది. ఆ తర్వాత రెండేళ్లకు ఆమోదించిన ప్రభుత్వం… గతేడాది డిసెంబర్ లో శంకుస్థాపన చేసింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
TS Rains: తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరికలు