Leading News Portal in Telugu

Home guard Ravinder: హోంగార్డు రవీందర్ మృతి.. కంచన్‌బాగ్‌లో ఉద్రిక్తత..


Home guard Ravinder: కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ మృతి చెందాడు. 70% కాలిన గాయాలతో ఉన్న రవీందర్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే నిన్న అతని పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈరోజు తెల్లవారుజామున రవీందర్ తుదిశ్వాస విడిచారు. డీఆర్‌డీవో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో డీఆర్‌డీవో వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు డీఆర్‌డీవో అపోలో వద్ద హోంగార్డుల ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు హోంగార్డులు విధులు బహిష్కరిస్తున్నారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని హోంగార్డులు కోరుతున్నారు.

తనకు రావాల్సిన జీతం తీసుకునేందుకు కార్యాలయానికి వెళ్లినప్పుడు ఏఎస్సై నర్సింగరావు, కానిస్టేబుల్ చందుతో పాటు మరో ఇద్దరు తనను అసభ్య పదజాలంతో దూషించారని రవీందర్ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. అవమానం భరించలేక హోంగార్డు రవీందర్ హెడ్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని ఒంటిపై నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఉస్మానియా నుంచి కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించారు. తనకు జరిగిన అన్యాయం మిగతా హోంగార్డులకు జరగకుండా చూడాలని వేడుకున్నట్లు తెలిసింది. అప్‌గూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య సంధ్య, పిల్లలు మనీష్ (16), కౌశిక్ (13) ఉన్నారు. రవీందర్ పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఏం జరిగింది..
పాతగస్తీ ఉప్పగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీ) సాయంత్రం గోషామహల్‌లోని ఏటీఎంకు వెళ్లి అతని బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా, ఇప్పటికీ అతని జీతం రాలేదు. వెంటనే గోషామహల్ లోని హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతంపై చర్చించారు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ అవుతాయని బదులిచ్చారు. అయితే తీవ్ర మనస్తాపానికి గురైన రవీందర్ బాటిల్‌లో తెచ్చిన పెట్రోల్‌ను తనపై పోసి నిప్పుపెట్టుకున్నాడు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్యం కావడంతో రవీందర్ ముఖంపై పెట్రోల్ పోసుకున్నాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఘటన మంగళవారం (సెప్టెంబర్ 5) షైనయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 55 శాతానికి పైగా కాలిన గాయాలతో తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో డీఆర్‌డీఓ ఆస్పత్రికి తరలించారు.

వేధింపులు కూడా..
అయితే సకాలంలో జీతం ఇవ్వకపోవడమే కాకుండా అధికారుల వేధింపులే భర్త ఆత్మహత్యాయత్నానికి కారణమని భార్య సంధ్య చెబుతోంది. జీతం రాకపోవడమే కాదు.. ఇప్పుడు తన భర్తకు మంచి వైద్యం అందించే పరిస్థితి లేదని, హోంగార్డుల దుస్థితికి ఇదే నిదర్శనమని.. సీఎం కేసీఆర్ స్పందించాలని కోరారు.

మరోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం హోంగార్డుల్లో ఆగ్రహానికి దారి తీసింది. విధుల బహిష్కరణతో పాటు హోంగార్డు జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. హోంగార్డులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రవీందర్‌కు మద్దతుగా హోంగార్డులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఇంతలో ఆయన కన్నుమూశారు.

రాజకీయ విమర్శలు
మరోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం రాజకీయంగా దుమారం రేపింది. ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రవీందర్ కుటుంబాన్ని బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి రవీందర్‌, కుటుంబ సభ్యులను పరామర్శించారు. హోంగార్డులకు కనీస హక్కులు కూడా కల్పించకుండా బీఆర్ ఎస్ ప్రభుత్వం హోంగార్డు వ్యవస్థను అవమానిస్తున్నదని, హామీ ఇచ్చి ఐదేళ్లు గడుస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం హోంగార్డుల ఉద్యోగ భద్రతపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.