సూర్యాపేట డీసీఎంఎస్ చైర్మన్ వట్టే నాయకుడు వట్టె జానయ్యపై తప్పుడు కేసులను ఖండిస్తున్నామన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ, ఆర్.కృష్ణయ్య. జానయ్య యాదవ్ పై మంత్రి జగదీశ్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ అరాచకాలు చివరి గడియకు వచ్చాయని మండిపడ్డారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, జానయ్య భార్య వట్టె రేణుక లతో కలసి మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట అసెంబ్లీ స్థానం వట్టె జానయ్యకు కేటాయించాలని డిమాండ్ చేశారు. జానయ్యపై అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని లేనిపక్షంలో మంత్రి జగదీశ్ రెడ్డి బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో సూర్యాపేట పోలీసులు వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని లేనిపక్షంలో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీలు అంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాల తరపున తాను అండగా ఉండేందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వట్టే జానయ్య చెప్పడం అభినందనీయం అన్నారు. జానయ్య రాజకీయంగా ఎదగనీయకుండా ఆయనపై మంత్రి జగదీష్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు.