ఇన్నాళ్లూ విదేశాల్లో జరిగిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫైట్‌లను టీవీల్లో వీక్షిస్తున్న డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులకు ఇప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం లభించింది. డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్‌లు శుక్రవారం హైదరాబాద్‌లో జరగనున్నాయి. WWE సూపర్ స్పెక్టాకిల్ గచ్చిబౌలి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే డబ్ల్యూడబ్ల్యూఈలో ఈసారి భారత రెజ్లర్లతో పాటు వివిధ దేశాలకు చెందిన 28 మంది ప్రముఖ రెజ్లర్లు బరిలో నిలిచారు. ఎన్నో టైటిల్స్ సాధించిన జాన్ సెనా.. ఫ్రీకిన్ రోలిన్స్ తో బరిలోకి దిగుతున్నాడు. వీరిద్దరూ జియోవానీ విన్సీ, లుడ్విగ్ కైజర్‌లతో తలపడనున్నారు.
సింధు షేర్ (సంగా, వీర్), కెవిన్ ఓవెన్స్, సమీ జైన్ WWE ట్యాగ్ టీమ్ టైటిల్ కోసం పోరాడనున్నారు. మహిళల WWE వరల్డ్ టైటిల్ కోసం రీమ్యాచ్‌లో నటల్యతో రియా తలపడనుంది. వీరితో పాటు డ్రూ మెక్‌ఎల్ట్రీ, శాంకీ, రింగ్ జనరల్ గుంథర్, జియోనీ విన్సీలు కూడా బరిలోకి దిగనున్నారు. ఈ ఈవెంట్ టిక్కెట్లు బుక్ మై షోలో అందుబాటులో పెట్టగా.. అనుకున్న సమయంకంటే ముందుగానే అమ్ముడుపోవడం విశేషం. దీంతో దాదాపు నాలుగు వేల మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం మొత్తం నిండిపోనుంది. ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.