Leading News Portal in Telugu

Etela Rajender : కేసీఆర్‌ మాటలకు చేతలకు పొంతన ఉండదు


నల్లగొండ జిల్లా దేవరకొండ బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు పేదలు, గిరిజనులు, దళితులు ఎన్నికల సమయంలో నే గుర్తుకు వస్తారని ఆయన విమర్శించారు. చందంపేట మండలానికి చెందిన బాలికను హైదరాబాద్ లో అత్యాచారం చేశారంటే కేసీఆర్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చిన వారికి ఒక్క రూపాయి అయిన సహాయం చేశారా అని ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు కానీ పాలన మొత్తం కేసీఆర్‌దే అని ఆయన వ్యాఖ్యానించారు. గుండంబా తయారు చేయకండి అని చెప్పి.. గల్లీలో మద్యం షాపులు తెరిచాడు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు.

అంతేకాకుండా.. సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బు కన్నా .. మద్యం ద్వారా వసూలు చేస్తున్న డబ్బే ఎక్కువ అని ఆయన ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ వద్ద కుర్చీ వేసుకుని కూర్చుని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట ఏమైందని ఆయన అన్నారు. భూ కబ్జా చేశానని కేసీఆర్ నన్ను వెళ్ళగొడితే నా బొమ్మతో గెలిచా, కేసీఆర్ నా మీద పిలగాన్ని ఎందుకు పెడతావు నువ్వే రా అంటే రాలేకపోయాడని ఆయన అన్నారు. నీ పథకాలకు, మద్యానికి, బిర్యాని ఆశపడే జాతి తెలంగాణ జాతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి కేసీఆర్ చేతిలో మోసపోతే గోస పడతామని, వచ్చే ఎన్నికల్లో దేవరకొండలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.