Leading News Portal in Telugu

MLA Raghunandan Rao : బీజేపీలో ఉంటే బీసీ బంధు ఇవ్వం అని బెదిరిస్తున్నారు


బీజేపీలో ఉంటే బీసీ బంధు ఇవ్వం అని బెదిరిస్తున్నారన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ బంధు పథకం చాట్ల తవుడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్లు ఉందని ధ్వజమెత్తారు. ఏజెంట్లను పెట్టుకొని బీఆర్‌ఎస్‌కు వత్తాసు పలికే వాళ్లకు బీసీ పథకం అందిస్తున్నారని రఘునందన్‌ రావు ఆరోపించారు. బీసీ పథకం కోసం సిద్దిపేట జిల్లాలో 26 వేల అప్లికేషన్స్ వచ్చాయని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నచోట కనీసం బీసీ పథకం లబ్దదారుల జాబితా కూడా ఇవ్వడం లేదన్నారు రఘునందన్‌ రావు.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పట్టుమని పది మంది కూడా లేరని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కొన్నిచోట్ల ఒక్కో ఇంట్లో ఇద్దరికీ బీసీ పథకం అందిస్తున్నారని, 93 కులాలకు బీసి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రఘునందర్‌ రావు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లేదని, ఉన్న వారికే మళ్ళీ బీసీ పథకం అమలు చేస్తున్నారన్నారు రఘునందన్‌ రావు. సర్పంచ్ లను కూడా బీఆర్‌ఎస్‌ పథకం లెక్కలోకి తీసుకోవడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు.