ప్రపంచ ప్రభావవంతమైన నాయకులందరూ ప్రస్తుతం ఢిల్లీలో ఉండటంతో.. యావత్ ప్రపంచం దృష్టి భారత్‌పైనే ఉందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో మనం నిర్వహిస్తున్న ఈ సమావేశాల ప్రారంభ సెషన్‌లోనే 55 దేశాల కూటమి అయిన ఆఫ్రికన్ యూనియన్‌కు జీ-20లో సభ్యత్వం కల్పించేందుకు చేసిన కృషి ప్రశంసలు అందుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి దౌత్యనీతి, ప్రపంచాధినేతల్లో ఆయనకున్న ప్రత్యేక గౌరవం కారణంగా.. ‘జీ-20 న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్’ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందిందని కిషన్ రెడ్డి అన్నారు. అదే సమయంలో.. రాహుల్ గాంధీ విదేశాల్లో కూర్చుని భారతదేశ సామర్థ్యంపై, భారతీయులపై అర్థరహితమైన, అసంబద్ధమైన విమర్శలు, దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీపై ఆయనకు, ఆయన కుటుంబానికి ఉన్న కోపాన్ని.. క్రమంగా దేశం పట్ల ద్వేషంగా మార్చుకున్నారన్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి, వారి మేధోవర్గానికి భారతదేశ ప్రయోజనాలపై ఏమాత్రం ఆసక్తి లేదని, భారతదేశానికి.. తన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసే ఓ బాధ్యతాయుతమైన విపక్షం కావాలని కిషన్ రెడ్డి అన్నారు. అంతే కానీ.. తమ వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకునేందుకు దేశ ప్రతిష్టను దిగజార్చే స్వార్థపూరిత రాజకీయ నాయకులు మన దేశానికి ఎంతమాత్రం అవసరం లేదని కిషన్ రెడ్డి హితవు పలికారు. ఇదిలా ఉంటే.. ఇవాళ ఢిల్లీలో ప్రారంభమైన జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ ఇండియాకు బదులుగా భారత్ పేరే కనిపిస్తోంది, వినిపిస్తోంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జీ20 సదస్సులో పాల్గొనే అతిధులకు పంపిన ఆహ్వనంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరును ప్రస్తావించింది. ఇండియాకు బదులుగా భారత్ పేరు వాడారన్న వివాదం కూడా మొదలైంది కూడా ఇక్కడే. అయితే ఇవాళ ప్రధాని మోడీ ముందు ఇండియాకు బదులుగా భారత్ నేమ్ ప్లేట్ కనిపించడంతో దీనిపై చర్చ జరుగుతోంది.