గ్రేటర్ హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం మొదలైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తార్నాక, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్. లిబర్టీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం మాదాపూర్, అఫ్జల్ గంజ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు సంగారెడ్డి, పటేన్ చెరు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. జంట జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పలుచోట్ల ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే.. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ వాఖ హెచ్చరికల నేపథ్యంలో నగర మేయర్ గద్వాల్ లక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. మరోవైపు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో శని ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మూడు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వివరించింది. వచ్చే మూడు రోజుల్లో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గాలులు కూడా వీస్తాయని వివరించింది.