Leading News Portal in Telugu

Singireddy Niranjan Reddy : రాష్ట్రంలో యూరియా కొరత లేదు.. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు


రాష్ట్రంలో యూరియా కొరత లేదు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి. ఇవాళ ఆయన హైదరాబాద్ సచివాలయంలో ఎరువుల సరఫరా, నిల్వలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ వానాకాలం సీజన్ కు 9.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు 7.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు, మార్చి 31 నాటికి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ముందస్తు నిల్వ ఉన్నట్లు తెలిపారు. మొత్తం ఈ సీజన్ లో ఇప్పటి వరకు అందుబాటులో ఉంచిన యూరియా 9.93 లక్షల మెట్రిక్ టన్నులు అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిల్వలు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు అని, ఈ ఏడాది రుతుపవనాల ఆలస్యం మూలంగా 10 లక్షల ఎకరాల సాగువిస్తీర్ణం తగ్గిందని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎరువుల కొరత లేదని, రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 16,615 అధీకృత డీలర్ల ద్వారా యూరియా సరఫరా జరుగుతున్నదన్నారు. మొత్తం రాష్ట్రంలో కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో కృత్రిమ యూరియా కొరతను సృష్టించి రాష్ట్రంలో యూరియా అందుబాటులో లేదని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో యూరియా లేదంటూ దుష్ప్రచారానికి తెరలేపారన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. ఇది అవగాహనా రాహిత్యమే కాదు.. దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమని ఆయన దుయ్యబట్టారు. సంబంధిత సహకార సంఘాల మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం .. ఉద్దేశపూర్వకంగా తప్పుచేసిన ఎవరినీ ఉపేక్షించమని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు రాష్ట్రంలో 15,838 మెట్రిక్ టన్నుల యూరియా ఖరీదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.