Leading News Portal in Telugu

Electrocution : విద్యుదాఘాతంతో దంపతులు మృతి.. అనాథలైన ముగ్గురు పిల్లలు


బండ్లగూడలోని ఇంట్లో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన్వీర్ (36), అతని భార్య షకీరా బేగం గత కొన్నాళ్లుగా బండ్లగూడలోని గౌస్‌నగర్‌లోని తమ ఇంట్లో ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. శనివారం ఉదయం షకీరాబేగం ఇంట్లోని నీటి పంపు స్విచ్ ఆన్ చేసేందుకు వెళ్లగా విద్యుదాఘాతానికి గురైంది. అది గమనించిన తన్వీర్ ఆమెను రక్షించేందుకు పరుగెత్తాడు మరియు ఆమెను రక్షించే ప్రయత్నంలో అతను కూడా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి చేరుకుని విద్యుత్‌ సరఫరా నిలిపివేసి ఇద్దరినీ విద్యుత్‌ తీగల నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే ఇద్దరూ చనిపోయారు. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సుల్తానాబాద్ మండలం దుబ్బ పల్లి గ్రామం పెట్రోల్ పంప్ ఎదురుగా రాజీవ్ రహదారిపై బైక్ అదుపుతప్పి యువకుడు మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే ఓదెల మండలం నాంసంపల్లి గ్రామానికి చెందిన నేదురు కుమార్ ( 26 ) అనే యువకుడు తన టిఎస్ 22 డి 4944 నెంబరు గల ద్విచక్ర వాహనంపై నాంసంపల్లి నుంచి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో దుబ్బపల్లి పెట్రోల్ బంక్ ఎదురుగా అదుపుతప్పి వెహికల్ పై నుండి పడి తలకు తీవ్రమైన గాయాలు అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయేందర్ తెలిపారు.