Leading News Portal in Telugu

Junior Artist Karthik: జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?


Junior Artist Karthik: హైదరాబాద్‌లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమించిన అమ్మాయితో దగ్గరవుతున్నాడనే కోపంతో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడు.

మహబూబాబాద్ జిల్లా సంకిస గ్రామానికి చెందిన కె.కార్తీక్ (18) హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. ఆగస్టు 13 నుంచి కనిపించకుండా పోయాడు.. 16న సోదరుడు శంకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని గుర్తించారు. విజయనగరం జిల్లా రాగోలుకు చెందిన సాయి హైదరాబాద్‌లో ఉంటూ యూట్యూబర్‌గా పనిచేసేవాడు. అతనికి జూనియర్ ఆర్టిస్ట్ అయిన ఓ యువతి (19) పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా సాయి ప్రవర్తన యువతికి నచ్చలేదు. ఈ క్రమంలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న కార్తీక్ ఆ యువతికి దగ్గరయ్యాడు. గత నెలలో వారిద్దరూ యూసుఫ్ గూడలోని కార్తీక్ సోదరుడు శంకర్ గదికి వెళ్లి మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సాయి కార్తీక్‌తో గొడవ పడ్డాడు. ఆపై అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులు కె.సురేష్, ఎం.రఘు, ఎన్.జగదీష్ సహాయం కోరారు.

పథకం ప్రకారం కార్తీక్ ఆగస్టు 13న గదికి వెళ్లారు. ఆ యువతి దుస్తులు కొన్ని గదిలో ఉన్నాయని, వాటిని తీసుకెళ్లాలని నమ్మించారు. అనంతరం కార్తీక్‌ను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని పాతబోయినపల్లి అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్లారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న కత్తితో కార్తీక్‌ను చెట్టుకు కట్టేసి పక్కటెముకల్లో పొడిచారు. కత్తి వంగిపోవటంతో బోర్లా పడేసి పీక కోశారు. పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ సెల్‌ఫోన్‌ను సురేష్ ఆన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడి ఆచూకీ వెంటనే తెలిసింది. సురేష్‌ని అదుపులోకి తీసుకోగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నిందితులు సాయి, రఘు, జగదీష్‌లను అరెస్టు చేశారు. కార్తీక్ హత్యలో యువతి ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Viral Video : బామ్మోయ్ నువ్వు సూపర్ .. అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ ఇరదీసిన బామ్మ..