హైదరాబాద్‌లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. హైదరాబాద్‌లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆదివారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. అయితే.. ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి కూడా వాన కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు వెళ్లడం కష్టంగా మారింది. అలాగే నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
అయితే.. తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సోమవారం నుంచి బుధవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగులో గురువారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.