Leading News Portal in Telugu

Gadwal MLA Case: గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట


గద్వాల్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించిన తెలంగాణ హైకోర్టు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే హైకోర్టు తీర్పుపై కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అయితే, అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం అందించారని కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అంతేకాదు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే హైకోర్టు తీర్పుపై కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీంను ఆశ్రయించాగా.. ఈ క్రమంలో ఇవాళ ( సోమవారం ) సుప్రీం కోర్టులో బండ్ల పిటిషన్‌పై విచారణ జరిగింది. వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు తెలిపింది.

ఇక, అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించారంటూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికపై హైకోర్టులో డీకే అరుణ పిటిషన్‌ దాఖలు చేయగా.. అయితే.. ఎన్నికల అఫిడవిట్ లో బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పకపోవడం తన తప్పని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఒప్పుకున్నారు. ఆ ఖాతాలు మాత్రం తన భార్యవని, అవి సేవింగ్స్‌ ఖాతాలని తన తరపు న్యాయవాది ద్వారా బండ్ల వాదనలు వినిపించారు. ఇక.. వ్యవసాయ భూమిని 2018 ఎన్నికలకు ముందే అమ్మివేశాను.. దానివల్ల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడలేదని కోర్టుకు కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. అయితే.. వివరాలు వెల్లడించకపోవడం ఖచ్చితంగా చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని డీకే అరుణ తరఫున న్యాయవాది కోర్టులో వాదించారు. ఇక, ఇప్పటికే డీకే అరుణను కేంద్ర ఎన్నికల కమిషన్ ఎమ్మెల్యేగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.