Leading News Portal in Telugu

Accident : సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి


సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్న కోడూరు మండలం అనంత సాగర్ శివారులోని రాజీవ్ రహదారిపై అగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి క్వాలిస్ వాహనం ఢీ కొట్టింది. దీంతో.. ఘటనా స్థలంలోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఎనిమిది మంది సీరియస్‌గా ఉన్నారు. క్వాలిస్‌లో మొత్తం11మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నితిన్ , గ్రీష్మ, నమ్రత అనే ముగ్గురు విద్యార్థులు ప్రమాద స్థలంలోనే మరణించారు. వీరంతా కరీంనగర్‌లోని తిమ్మాపూర్‌లో పరీక్ష రాసి సిద్దిపేటకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులంతా సిద్దిపేట ఇందూర్ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే.. ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు విద్యార్థులను మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ తరలించాలని వైద్యులను ఆదేశించారు. గాయాలైన మరికొంత మంది విద్యార్థులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించాలని మంత్రి హరీష్‌ రావు సూచించారు. మృతి చెందిన విద్యార్థులకు సంతాపం వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి హరీష్‌ రావు. అధైర్య పడొద్దు అండగా ఉంటానని మంత్రి హరీష్ రావు విద్యార్థుల కుటుంబాలతో ఫోన్ లో మాట్లాడి మనోధైర్యాన్ని నింపారు.