ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్రంగా ఖండించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వం రాజకీయ వేధింపుల కేసు పెట్టటం దారుణమన్నారు ఎమ్మెల్యే సండ్ర. ప్రజాస్వామ్యంలో ఇటువంటి కక్షపూరిత కేసులు సమంజసం కాదని, అణచివేత రాజకీయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిందన్నారు ఎమ్మెల్యే సండ్ర. అంతేకాకుండా.. కేంద్ర బీజేపీ అండతోనే ఏపీ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుందన్నారు. బీజేపీకి జగన్ మద్దతు పలుకుతూ రాష్ట్రంలో మాత్రం బీజేపీనీ ఖండిస్తున్నట్లు ప్రకటించటం విడ్డూరమని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు కేసులో అవినీతి జరగలేదని ఆ సంస్థ ఎండీ ప్రకటించారని, తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్, వారి కుటుంబం పై కూడా ప్రతిపక్షాలు ఇష్టానుసారం గా విమర్శలు చేసిన ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్నారు. ఏపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. చంద్రబాబుపై కేసుల విషయంలో ఇక తగ్గేదేలే అన్నట్లుగా ఆయన లాయర్ సిద్దార్థ్ లూథ్రా ట్వీట్ చేశారు. ఇక కత్తి దూసి పోరాడాల్సిందేనని.. ఔరంగజేబుకు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ రాసిన జఫర్నామాలోని కొన్ని వాఖ్యలను ట్వీట్‌లో ఆయన ప్రస్తావించారు. ‘ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది’ అంటూ గురుగోవింద్ సింగ్ సూక్తిని లూథ్రా ట్వీట్ చేశారు. దీంతో పాటు చంద్రబాబుకు సపోర్టుగా చేసిన పలు ట్వీట్లను కూడా సిద్ధార్థ రీట్వీట్ చేశారు. ఆఖరిగా ‘ఈ రోజు ఇదే నా నినాదం’ అని లూథ్రా పేర్కొన్నారు.