నిరుద్యోగులకు కేసీఆర్ చేసిన మోసాన్ని నిరసిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని దీక్షాస్థలి నుంచి అక్రమంగా తరలించడాన్ని.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు. ఈ దీక్షను ప్రశాంతంగా జరిపేందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ.. పోలీసులు అక్రమంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డి చేస్తున్న దీక్షకు.. తెలంగాణ నిరుద్యోగ యువతనుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో.. జీర్ణించుకోలేకే కేసీఆర్ ఇలా పోలీసులను పురమాయించారని, జెడ్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తితో ఇలాగేనా వ్యవహరించేది అని ఆయన ప్రశ్నించారు.
పోలీసుల తోపులాటలో.. కిషన్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయని, పోలీసుల వ్యవహారశైలి అక్రమం అని ఆయన ధ్వజమెత్తారు. ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలకు కూడా గాయలయ్యాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తరుణ్ చుగ్. బీజేపీ చేపడుతున్న శాంతియుత నిరసన ప్రదర్శనను కూడా కేసీఆర్ తట్టుకోలేక పోతున్నాడని, దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో యువత.. కేసీఆర్ కు సరైన సమాధానం చెబుతారని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు.