Leading News Portal in Telugu

Health Department: రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ సమీక్ష


తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల పరిస్థితిపై నేడు (గురువారం) వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమీక్షలో హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ, డీపీహెచ్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్‌ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న అంశాలు.. డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు.. రాష్ట్రంలో ఫీవర్‌ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవు అని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.. ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునేలా దవాఖానలు సిద్ధంగా ఉండాలన్నారు. జ్వర బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలి.. ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్‌వోలు హైరిస్క్‌ ఏరియాలను గుర్తించి జాగ్రత్త చర్యలు చేపట్టాలి అని పేర్కొన్నారు.

జ్వరాలు నమోదయ్యే చోట పల్లె, బస్తీ దవాఖానలను అప్రమత్తం చేయాలి.. ల్యాబ్‌ రిపోర్టులను కచ్చితంగా 24 గంటల్లోగా అందించాలి.. అయితే ఒకవేళ రోగికి అనుమానిత లక్షణాలు ఉంటే రిపోర్టుల కోసం ఎదురుచూడకుండా వెంటనే చికిత్స ప్రారంభించాలి.. అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలకు జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి.. జిల్లాల్లో 24 గంటల కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేయాలన్నారు. మీడియా సమావేశాలు నిర్వహించి సీజనల్‌ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలి.. మలేరియా విభాగం అడిషనల్‌ డైరెక్టర్‌ను కొత్తగూడెం పంపి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.

ములుగు జిల్లాలో డెంగీతో వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ కొన్ని మీడియా సంస్థల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని జిల్లా అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి జిల్లాలో వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ, ఇంటింటి సర్వే, జ్వరాలపై అవగాహన చేపట్టామన్నారు. ఇప్పటివరకు 398 క్యాంపులు నిర్వహించి 24,678 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. అందులో 1392 మంది జ్వరబాధితులను, 28 మంది మలేరియా బాధితులను గుర్తించామన్నారు. ఈ నెలలో డెంగీతో నలుగురు మరణించారని చెప్పారు. అయితే వారు గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, జాండిస్‌, సికిల్‌ సెల్‌ అనీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు వివరించారు.