Leading News Portal in Telugu

CPI Narayana: చంద్రబాబును అరెస్ట్ చేయించింది బీజేపీ ప్రభుత్వమే..


టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించింది బీజేపీ ప్రభుత్వమే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా నారాయణగూడ వైఎంసీఏ సిగ్నల్ దగ్గర షోయబుల్లాఖాన్ చిత్ర పటానికి నారాయణ ఘన నివాళులు అర్పించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. బీజేపీ అండ దండలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాదని ఆయన అన్నారు.

టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.. దీంతో వస్తే రండి లేకపోతే లేదని బీజేపీకి పవన్ కళ్యాణ్ చెప్పినట్టే కదా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీకి అన్ని పార్టీలు భయపడినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భయపడుతుందని ఆయన విమర్శలు గుప్పించారు. అందుకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులను ఈ తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదని నారాయణ మండిపడ్డారు.

కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సాయుధ పోరాటంను అధికారికంగా చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అలాగే తెలంగాణ ప్రెస్ అకాడమీకి షోయబుల్లాఖాన్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ తొందరగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని నారాయణ చెప్పాడు.