ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు, మహిళలకు పెద్దపీట వేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి కుటుంబంలో ఇద్దరికీ పెన్షన్ ఇస్తాం.. కౌలు రైతులను ఆదుకుంటాం.. బూత్ స్థాయిలో కార్యకర్తలు సైనికుడిలా పని చేయాలి అని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.
తప్పు చేసిన ప్రతి ఒక్కరు తప్పించుకునే పరిస్థితి లేదని ఈటెల రాజేందర్ అన్నారు. ఎంతటి వారైన శిక్ష అనుభవించక తప్పదని ఆయన చెప్పుకొచ్చారు. తాత్కాలికంగా కొందరు ఆఫీసర్లతో తప్పించుకునేందుకు ప్రయత్నిం చేస్తున్నారు అంటూ ఈటెల విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులకు ప్రభుత్వ సంస్థలే తగిన శిక్ష వేస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు మరింత కష్టపడాలని ఈటెల రాజేందర్ అన్నారు. ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని వివరిస్తూ.. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనే విషయాలను తెలియజేయాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు యువకులకు ఉద్యోగాలు కూడా ఇస్తామని ఈటెల రాజేందర్ చెప్పారు.