కేంద్రమంత్రి ఆర్కే సింగ్ వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆర్థిక స్తోమత లేకనే తెలంగాణకు రుణాలు ఆపామంటూ కేంద్రమంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శతాబ్ది కాలంలోనే ఇది అతిపెద్ద అబద్ధమని ఆయన సెటైర్ వేశారు. తీసుకున్న రుణాలుతిరిగి చెల్లించడంలో ముందున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా, ఇచ్చే ఆర్థిక సంస్థలను భయపెడుతున్న దుర్మార్గం ఆర్కే సింగ్, కేంద్ర ప్రభుత్వాలదే అని ఆయన జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేసే పనులతో దేశానికి తీరని ద్రోహమని, తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పలేదని కేంద్ర విధ్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమన్నారు.
మీటర్లు పెట్టనందుకే నిధులు ఆపుతున్నామని కేంద్ర ప్రభుత్వం పంపిన ఉత్తరాలను ఎన్నోసార్లు ప్రజల ముందు ఉంచామని, దేశంలో మిగులు విద్యుత్ ఉన్నదనేది పెద్ద జోక్ అని ఆయన అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో ఉన్న కరెంట్ కోతలే ఆర్కే సింగ్ అసత్యపు వ్యాఖ్యలకు నిదర్శనమన్నారు. కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమని, రాత్రిపూట కరెంటు వాడితే సర్ ఛార్జ్ విధిస్తామని కేంద్ర మంత్రి హోదాలో ఆర్కేసింగ్ చేసిన వ్యాఖ్యలు నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి దిక్కు లేదనే అక్కసు తోనే ఆర్కే సింగ్ వ్యాఖ్యలు అని, ఇట్లనే మాట్లాడితే పైసలు ఇవ్వమంటూ భయపెట్టే ధోరణిలో ఆర్కే సింగ్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం మర్చిపోదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
వాటా ఇవ్వకపోవడానికి తెలంగాణ ఆర్కే సింగ్ జాగిరి కాదని, అది తెలంగాణ ప్రజల హక్కు అన్నారు. చెల్లించిన పన్నులే అడుగుతున్నామని, ఎన్ని అబద్ధాలు చెప్పినా కేసిఆర్ లక్షయశుద్ధిని ఆపలేరన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కోసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రజల నుండి వస్తున్న డిమాండ్ తోనే బీజేపీ పెద్దలకు అక్కసు ప్రదర్శిస్తున్నారన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా 24 గంటల కరెంటు ఇచ్చి తీరుతామని, అబద్దాలు చెప్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. అబద్ధాలు చెప్పే వారికి ఎలా బుద్ధి చెప్పాలో తెలంగాణ ప్రజలకు తెలుసు అని ఆయన అన్నారు.