భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలో జరుగుతోంది. సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో దిశా నిర్దేశం చేస్తున్నారు.
కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తు్న్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలను, ప్రభుత్వాలను నిర్వీర్య పరిచే తీరులో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నందున ఎలా ఎదుర్కోవాలి?.. బీజేపీని రాజకీయంగానే జాతీయ స్థాయిలో ఎలా ఎండగట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలు, మంజూరు చేసిన నిధుల విషయంలో వాస్తవాలను పార్లమెంటు సమావేశాల సందర్భంగా వివరించి బీజేపీ వైఫల్యాన్ని అన్ని పార్టీల సమక్షంలో నిలదీయాలని కూడా ఎంపీలకు కేసీఆర్ సూచించారు.
అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చింది ఇంతేనా.. అనే తరహాలో ఆ పార్టీ, ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షను పార్లమెంటులో ప్రస్తావించాలని ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మహిళా రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని మోడీ సర్కార్ ను డిమాండ్ చేయండి.. ఈ రెండు అంశాల విషయంలో ప్రతిరోజు పార్లమెంటులో గళం విప్పండి.. ఎన్నికలు వేర్వేరుగా వచ్చినా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కలిసి వచ్చినా బీఅర్ఎస్ పార్టీదే విజయం.. ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం అనూహ్య నిర్ణయాలతో ముందుకు వస్తే నేనే ఢిల్లీకి వస్తా అని కేసీఆర్ అన్నారు.