Leading News Portal in Telugu

Talasani Srinvias Yadav : దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఇండ్లను కట్టిన దాఖలాలు లేవు


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం డబుల్ బెడ్రూం ఇళ్లు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో కూడిన ఇల్లు నిర్మించి ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ఉద్దేశం. తద్వారా ప్రతీ ఇల్లు లేని పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలనే ధృడ సంకల్పంతో సీఎం కేసీఆర్ కలలు గని ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఇప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంతో మంది పేదలు డబుల్ బెడ్రూం ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులు అందజేసేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. తాజాగా దీనికి సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కీలక ప్రకటన చేశారు. ఇటీవల మొదటి విడుత కింద డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రభుత్వం లబ్దిదారులకు అందజేసిన విషయం తెలిసిందే.

అయితే.. తాజాగా రెండో విడుత డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రభుత్వం లబ్దిదారులకు అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ నుండి భారీగా దరఖాస్తులు వచ్చాయని, 13, 200 ఇండ్ల డ్రా ను నేడు తీస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఇండ్లను కటిన దాఖలాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఢిల్లీలోని ఐఏఎస్, ఐపీఎస్ ల క్వార్టర్స్ ల కంటే మంచిగా ఇక్కడి డబుల్ బెడ్ రూంలు కు ఉన్నాయి అని మాజీ గవర్నర్ నరసింహన్ అన్నారన్నారు. 2 బీహెచ్‌కేలో రిజర్వేషన్ లను పాటిస్తున్నామని, మూసి నది ప్రాంతంలో ఆక్రమణలో ఉన్న వారికి పునరావాసం కల్పిస్తామని ఆయన తెలిపారు. అవసరమైతే ఇంకా ఇండ్లను నిర్మిస్తామన్న మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌.. ఈ నెల 21వ తేదీన 2బీహెచ్‌కే పంపిణీ ఉంటుందని తెలిపారు. లబ్ధిదారుల అడ్రస్ మారితే వారు ఇది వరకు ఇచ్చిన అడ్రస్ కు సమాచారం ఇస్తామని ఆయన తెలిపారు.