Leading News Portal in Telugu

Khairatabad Ganesh: 63 అడుగుల దశ మహావిద్యా గణపతి సందర్శనకు సిద్ధం


Khairatabad Ganesh: జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.. గణపతి బొప్పా మోరియా.. గణేషుడి పండగ వచ్చిందంటే గల్లీ గల్లీకి వినపడే స్లోగన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేషుడు అంటే స్పెషల్. ఎందుకంటే అక్కడ ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటాడు. అయితే ఈ ఏడాది కూడా భక్తులను అనుగ్రహించేందుకు బొజ్జ గణపయ్య సిద్ధమయ్యాడు. భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఖైరతాబాద్‌ మహాగణపతి సందర్శనకు సిద్ధమయ్యారు.

నిర్వాహకులు ముందుగానే తెలిపినట్లుగానే మూడు రోజులు ముందుగానే దర్శనం కలిపిస్తు్‌న్నారు. ఈ పర్యాయం శ్రీ దశ మహావిద్యా గణపతిగా ఖైరతాబాద్‌ గణేషుడు 63 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దశ మహావిద్యా గణపతికి రంగులు వేయడం పూర్తి అయింది. సోమవారం జరిగే తొలిపూజకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌లను ఆహ్వానించినట్లు ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవాల నిర్వాహకులు వెల్లడించారు. మహాగణపతిని భక్తులు దర్శించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌ ప్రాంతంలో రద్దీ నెలకొనే అవకాశం ఉంది. దీంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శని, ఆదివారాల్లో భక్తులు చూసేందుకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ఇప్పటికే స్థానిక ప్రజలు అందరూ ఆసక్తిగా మహాగణపతిని చూసి ఆనంద పడుతున్నారు. సోమవారం వినాయక చవితి తొలి రోజు అయినందున ప్రముఖ వ్యక్తులు, అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని.. భద్రత విషయంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారని నిర్వాహకులు వెల్లడించారు.