హైదరాబాద్ రాచరిక రాష్ట్రం సెప్టెంబర్ 17, 1948న ఇండియన్ యూనియన్‌లో విలీనమైన రోజు ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ వేడుకల్లో పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే.. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్, ఇతర నేతలు స్వాగతం పలికారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని సీఆర్ఫీఎఫ్ కార్యాలయంలో.. రాష్ట్రానికి చెందిన పార్టీ అగ్రనేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశంపై అమిత్ షా ఆరా తీశారు. అంతేకాకుండా.. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో కూడా అమిత్ షా భేటీ అయ్యారు.
నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ‘విమోచన దినోత్సవం’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. గత ఏడాది కూడా తొలిసారిగా కేంద్రం అధికారికంగా నిర్వహించిన ఈ దినోత్సవ వేడుకలకు షా హాజరయ్యారు. ఈ దఫా కూడ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ తలపెట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ మేరకు బీజేపీ నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించిన తర్వాత రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది. రాష్ట్రంలో మూడు చోట్ల నుండి బస్సు యాత్రలు ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.