భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఉన్నతాధికారుల బృందం అక్టోబర్ 3 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా సందర్శించనుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిపే ఈ పర్యటనలో ఈ బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటూ వివిధ భాగస్వామ్య పక్షాలను, స్థానిక అధికారులను సంప్రదిస్తుంది అని ఆయన తెలిపారు.
మొదటి రోజున.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కీలక సమావేశాన్ని నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పర్యటనకు శ్రీకారం చుడుతుంది.. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో ఈసీఐ సమావేశం అవుతుందని వికాస్ రాజ్ అన్నారు. ఇక, రెండవ రోజున.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో సంసిద్ధతను సమీక్షించడంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తుంది అని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈఓలు), పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీలు), పోలీస్ కమీషనర్లు (సీపీలు).. ఈ బృందానికి వారి వారి సన్నద్ధత నివేదికలను సవివరంగా సమర్పిస్తారు అంటూ ఆయన తెలిపారు.
చివరి రోజయిన మూడవ రోజున ఓటర్లను క్రమపద్ధతిలో ఎలా చైతన్య పరుస్తున్నదీ.. ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనడానికి సంబంధించిన (ఎస్వీవీఈపీ) కార్యకలాపాలపై ఒక ప్రదర్శన చేస్తారని మీడియా సమావేశంలో సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఎన్నికల్లో పాల్గొనడంపై ప్రజలను చైతన్య పరచడానికి రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రముఖులను, దివ్యాంగ ఓటర్లను, యువ ఓటర్లను కేంద్ర ఎన్నికల బృందం నేరుగా కలుస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) లతో కూడా ఈ టీమ్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ఎన్నికల అధికార యంత్రాంగాన్ని, భద్రతా సంస్థలను సమన్వయ పరచడంలో వారు చేస్తున్న కృషిని పరిశీలిస్తుంది అని వికాస్ రాజ్ చెప్పారు. ఈసీఐ రాష్ట్ర పర్యటనలో చివరగా.. పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తుందని చెప్పుకొచ్చారు.