తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ఈసారి ఓ ట్రాన్స్‌జెండర్ ఎంపికైంది. సాధారణంగా ఎన్నికల సంఘం ఎలక్టోరల్ రోల్ మార్పులు, చేర్పులు, ఓటరు అవగాహన తదితర అంశాలపై ప్రచారం కోసం సెలబ్రిటీలను ఎంపిక చేస్తుంది. అయితే తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేస్తారు. వరంగల్ కరీమాబాద్ కు చెందిన లైలా అనే ట్రాన్స్ జెండర్ ను ఎంపిక చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆమెతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికి పైగా ఉన్న ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి లైలా నాయకత్వం వహిస్తున్నారు. వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులతో మాట్లాడి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వారానికి ఒకరోజు ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసింది లైలా.
ఓటు ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అనేక ఐకాన్‌లను ఎంపిక చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. వరంగల్‌కు చెందిన ఓరుగంటి లైలాను రాష్ట్ర ఐకాన్‌లలో ఒకరిగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రజలతో మమేకమై ఓటరు నమోదుకు కృషి చేస్తానని లైలా తెలిపారు. లింగమార్పిడి చేసుకున్న వారి పేర్లను ఓటరుగా నమోదు చేసి ఓటుపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా ఎన్నికల అధికారులతో కలిసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ హిజ్రా, ట్రాన్స్ జెండర్ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు లైలా కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు సహాయం, సపోర్టు అందించారు. ఇప్పటికీ తమను సమాజంలో చిన్న చూపు చూస్తున్నారని, మరోవైపు భిక్షాటన చేస్తే తప్ప జీవనం గడవదని, పై చదువులు చదివినా తమాలాంటి వారికి ఉద్యోగం ఉండదని, ట్రాన్స్ జెండర్ లను ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ పోరాటం చేస్తున్నారు లైలా. ఈ క్రమంలోనే లైలాను ఎన్నికల కమీషన్ ఎంపిక చేసింది.