నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాశాంతి పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాస్టర్స్ మీద వివక్ష చూపుతున్నాయని ఆయన అన్నారు. దేశంలో కాంగ్రెస్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, గల్లిలో లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
దేశాన్ని సర్వనాశనం చేసింది, అవినీతికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు కేఏ పాల్. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మహిళ రిజర్వేషన్ బిల్లు కేవలం ఎన్నికల స్టంట్ అని కేఏ పాల్ విమర్శించారు. అంతేకాకుండా.. కేసీఆర్ సర్కార్‌ది జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే అని ఆయన అన్నారు. కవిత అరెస్ట్ కాకపోవటమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. మునుగోడులో వందల కోట్లు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ గెలిచిందని, నాపై పోటీ చేసేందుకు అందరూ భయపడుతున్నారన్నారు. తెలంగాణలో 6 లక్షల కోట్ల అప్పు అయిందని ఆయన అన్నారు.