బైక్ వీల్‌లో చున్నీ (స్కార్ఫ్) ఇరుక్కుపోవడంతో కదులుతున్న ద్విచక్రవాహనంపై నుంచి పడి గాయపడిన ఓ మహిళ హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలం నాగురాంకు చెందిన జగన్‌రావు, పూజిత దంపతులు జ్వరంతో బాధపడుతున్న తమ ఇద్దరు కుమార్తెలు నిత్యశ్రీ, అజిశ్రీనులను సోమవారం బైక్‌పై జమ్మికుంటలోని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో ధర్మారం సమీపంలో పూజిత కండువా బైక్ వెనుక చక్రానికి ఇరుక్కోవడంతో ఆమె బైక్ పై నుంచి కిందపడి తలకు బలమైన గాయమైంది. జమ్మికుంటలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆమెను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచింది. జగన్ రావు ఓవర్ స్పీడ్ వల్లే తన కూతురు చనిపోయిందని పూజిత తల్లి మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే.. నల్లగొండ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద సాయంత్రం కారు అదుపు తప్పి బైకును ఢీకొట్టింది. ఆ తర్వాత కారు సైతం రోడ్డుపై పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు కారులో ఉన్న మరో ఇద్దరు సైతం ప్రాణాలు కోల్పోయారు.గాయపడ్డ వారిని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మద్దిమడుగు ప్రసాద్, అక్షయ్ చనిపోయారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.