Leading News Portal in Telugu

Manik Rao Thakre : మరోసారి సమావేశం కానున్న తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ”


కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితాను పార్టీ “సెంట్రల్ ఎలక్షన్ కమిటీ” ( కేంద్ర ఎన్నికల కమిటీ) కి పంపుతామన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. విడతల వారీగా అభ్యర్దుల జాబితాను విడుదల చేయాలా, లేదా పూర్తి జాబితాను ఒకేసారి విడుదల చేయాలా అన్నది కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” నిర్ణయిస్తుందని తెలిపారు. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను “స్క్రీనింగ్ కమిటీ” సత్వరమే పూర్తి చేసి, పూర్తి జాబితాను కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” ఆమోదానికి పంపుతామని మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు.

ఈ రోజు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ” మరోసారి సమావేశం కానున్నట్లు మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. అయితే.. ఈరోజు పూర్తి జాబితాను ఖరారు చేసి, పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” ఆమోదానికి తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ” పంపనున్నట్లు తెలిపారు. నిన్న అర్ధరాత్రి వరకు, సుమారు 8 గంటల పాటు ఏకధాటిగా సాగిన సమాలోచనలు జరిగాయి. తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా ను దాదాపు ఈ రోజే “సెంట్రల్ ఎలక్షన్ కమిషన్” ఆమోదానికి పంపనుంది “స్క్రీనింగ్ కమిటీ”.

అయితే.. నిన్న మొదటి భేటీ, నేడు కూడా భేటీ ఉంటుందని తెలిపారు మాణిక్ రావు ఠాక్రే. నిన్న సమావేశంలో అన్ని అంశాలపై చర్చ జరిగిందని, సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు మాణిక్ రావు ఠాక్రే. ఆశావహులు ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని, అందరి “బయో డేటా” లు ( పూర్తి వివరాలు) మా దగ్గర ఉన్నాయని మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు. బీజేపీ, బీఅర్ఎస్ వేరు కాదని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు అభిప్రాయం కలిగించేందుకు బీఅర్ఎస్ చేసిన ప్రయత్నం విఫలం అయిందన్నారు మాణిక్ రావు ఠాక్రే. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితి లేదని మాణిక్ రావు ఠాక్రే వ్యాఖ్యానించారు. పదేళ్ళలో కేసీఆర్ కుటుంబం తెలంగాణకు చేసిందేం లేదని, తెలంగాణలో సంపాదించిన డబ్బును పక్కరాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం కేసీఆర్
ఖర్చు చేస్తున్నారన్నారు.