Vote From Home: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడితో ఎన్నికల సందడి మొదలైందని తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాలు, బహిరంగ సభలతో ఇప్పటికే పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. అయితే.. మధ్యలో జమిలి ఎన్నికల మాట తెరపైకి రావడంతో.. కొంత అనిశ్చితి ఏర్పడి.. ఈసారి కుదరదని తేలిపోవడంతో.. మళ్లీ యథావిధిగా తమ పనిలో మునిగిపోయారు. కాగా, వచ్చే నెల మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు కేంద్ర ఎన్నికల అధికారులు కూడా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. దీంతో… షెడ్యూల్ ప్రకారమే… డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఈసీ కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల్లో ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలిసారిగా.. ఈ ఓటు ఫ్రమ్ హోమ్ విధానాన్ని కర్ణాటక ఎన్నికల్లో అమలు చేశారు. అక్కడ సక్సెస్ కావడంతో తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
Read also: Hyderabad: అన్యోన్య దంపతులు.. ఉప్పల్‌లో ఉప్పు బస్తాలు చోరీ చేసిన భార్య భర్తలు
అయితే ఈ ఆప్షన్ 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పించనున్నారు. వీరితో పాటు వికలాంగులకు కూడా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించాలని ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో 80 ఏళ్లు దాటిన మొత్తం ఓటర్ల సంఖ్యపై సీఈసీ తాజా సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. ప్రస్తుతం తెలంగాణలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4,87,950 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా వారికి పోస్టల్ బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని సీఈసీ సూచించింది. అయితే, 80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేయాలనుకుంటే ముందుగా తమ స్థానిక ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే అధికారులు పోస్టల్ బ్యాలెట్లను సిద్ధం చేస్తారు. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాల్లోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.
Vande Bharat Express: ‘వందేభారత్’లో ప్రయాణం మరింత సౌకర్యవంతం.. మార్పులు చేయనున్న రైల్వేశాఖ