గ్రూప్-1 రద్దుకు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణంగా తెలంగాణ హైకోర్టు చూపింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రతి నిబంధనను తప్పకుండా పాటించాల్సిందిగా టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను గైడ్ లైన్స్ ప్రకారం నిర్వహించలేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. గ్రూప్-1 పరీక్షను మరోసారి నిర్వహించి నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని నిబంధనలు పాటించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ తో పాటు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని సూచనలను తప్పకుండా పాటించాలని పేర్కొంది.
పరీక్ష నిర్వహణలో తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అభ్యర్థుల డేటాను సేకరించడంలోనూ టీఎస్పీఎస్సీ విఫలమైంది అని ఉన్నత న్యాయస్థానం చెప్పింది. గ్రూప్-1 పరీక్ష అభ్యర్థులకు ఎంత ప్రాముఖ్యమో తెలిసి కూడా టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వహించింది.. టీఎస్పీఎస్సీ సమర్పించిన కౌంటర్ పై హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను సైతం టీఎస్పీఎస్సీ తప్పుగా చూపించిందని న్యాయస్థానం తెలిపింది. జూన్ 28న 2, 33, 506 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్ ఇచ్చింది. కానీ కౌంటర్లో మాత్రం 2,33, 248 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు తెలిపింది అని హైకోర్టు వ్యాఖ్యానించింది.