జాతీయ పార్టీగా కాంగ్రెస్ సముచిత నిర్ణయాలు తీసుకుంటుంది అని తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మధుయాష్కి గౌడ్ తెలిపారు. ఎవరికీ, ఎలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు.. ఏళ్ళ తరబడి నిబద్దతతో పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలెవరికీ అన్యాయం జరుగదు అని ఆయన తెలిపారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నేతలను ప్రస్తుత అత్యవసరాల రీత్యా అసెంబ్లీ అభ్యర్థులుగా ఎంపిక చేసినా.. సుదీర్ఘకాలంగా పని చేస్తున్న పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగదు అంటూ మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా చేసుకుని ఎక్కడైనా అలాంటి నిర్ణయం జరిగినా నిరాశ పడవద్దు అని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మధుయాష్కి గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీలుగా, ఇతరత్రా పదవులు ఇచ్చే విధంగా నేరుగా పార్టీ అధిష్ఠానం నుంచి హామీ ఉండేలా చేస్తామని ఆయన చెప్పుకొచ్చాడు. అవసరమైతే, అలా నష్టపోయున కార్యకర్తల రాజకీయ భద్రత కోసం ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో కమిటీ వేస్తామని వెల్లడించారు. అయితే, సోషల్ మీడియాలో ఖరారైన అభ్యర్ధుల జాబితా అంటూ వచ్చే సమాచారాన్ని ఎవరూ నమ్మొద్దు అని మధుయాష్కి గౌడ్ తెలిపాడు.
సోసల్ మీడియాలో వచ్చేది అసత్య ప్రచారం మాత్రమేనని మధుయాష్కిగౌడ్ తెలిపారు. అలాంటిదేమీ ఇంతవరకు జరగలేదు.. అలాంటి అబద్దపు జాబితాలో పేరుందని సంతోషపడి, టపాసులు పేల్చద్దు.. లేదని దిగులు పడవద్దు.. పూర్తి పారదర్శకంగా అభ్యర్దుల ఎంపిక ఉంటుంది.. ఒకేసారి అభ్యర్ధుల జాబితా విడుదలపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.