Leading News Portal in Telugu

R.Krishnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసిన ఆర్.కృష్ణయ్య..


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య సమావేశం అయ్యారు. కృష్ణయ్యతో పాటు పలువురు బీసీ నేతలు కూడా కవితతో భేటీ అయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోట అమలు చేసేలా జాతీయ స్థాయిలో కృషి చేయాలని ఆమెను కోరారు. 40 ఏళ్ల నుంచి బీసీల కోసం పోరాటం చేస్తున్నామని.. ఢిల్లీలో దాదాపు 80 సార్లు ధర్నా చేశామని కృష్ణయ్య పేర్కొన్నారు.

అలాగే.. బీసీల కోసం, బీసీ బిల్లు కోసం 65 సార్లు ప్రధాన మంత్రులను కలిసామని, కానీ ఈనాటికి బీసీలకు తీరని న్యాయం జరుగుతునే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. అన్ని పార్టీలను కలిసి బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేలా చేయాలని కవితతో చర్చించామని ఆయన చెప్పుకొచ్చారు. దశాబ్దాలుగా బీసీ బిల్లుకు మోక్షం కలగటంలేదని.. ఇప్పటికైనా పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక, బీసీల బిల్లు ప్రవేశపెట్టే సమయం వచ్చిందని బీసీల నినాదం ఢిల్లీని తాకిందన్నారు.. ఇక బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు కలిసి కట్టుగా పోరాటం చేయాలని ఆర్.కృష్ణయ్య అన్నారు.

ఇక, మహిళ బిల్లులో ఓబీసీ సబ్ కోటా ఏర్పాటు చేయాలని కోరామని ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ నెల 26న హైదరాబాద్ లోని జలవిహర్ లో బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలతో పెద్ద సమావేశం కానున్నట్లు ఆయన వెల్లడించారు. మహిళ బిల్లు పెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేశారు.. మహిళ బిల్లు రావడంతో బీసీ బిల్లు అంశం ముందుకు వచ్చింది.. బీసీ ఉద్యమన్ని ముందుకు తీసుకోవాలి.. బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు అందించాలి అని ఆర్.కృష్ణయ్య కోరారు.