Leading News Portal in Telugu

TS Heavy Rain: తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు.. హైదరాబాద్‌లో జల్లులు కురిసే అవకాశం


TS Heavy Rain: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా పశ్చిమం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నేడు నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సోమవారం (25) కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు తెలిపారు.

నగరంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు వెనక్కి తగ్గనున్నాయి. తెలంగాణ నుంచి రుతుపవనాల ఉపసంహరణ అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సెప్టెంబర్ నెలాఖరు వరకు హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు ఉంది. రుతుపవనాల ప్రభావంతో దేశంలో సాధారణ సగటు వర్షపాతం 832.4 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఈసారి 780.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్టోబరు 15 నాటికి నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా వెళ్లిపోతాయని తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో ఉత్తర, మధ్య భారతంలో వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read also: Gold Price Today: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

విషాద వానలు..

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు విషాదాన్ని నింపాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ వర్షాల కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఆసిఫాబాద్ గ్రామపంచాయతీ పరిధిలోని హీరాపూర్‌కు చెందిన లక్ష్మీబాయి, 24 ఏళ్ల చంద్రకళ దంపతులు. ఎప్పటిలాగే శనివారం కూడా వ్యవసాయ పనులకు వెళ్లారు. వారు తమ పనిలో నిమగ్నమై ఉండగా, పిడుగు పడింది. దీంతో చంద్రకళ తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే పడిపోయింది. తరువాత ఆమె మరణించింది. అయితే ప్రస్తుతం ఆ తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

అదేవిధంగా ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామ పంచాయతీలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గుట్టచెలిమకు చెందిన దేవురావు (24) శనివారం పొలానికి వెళ్లాడు. పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో అతడు చనిపోయాడు. ఇదిలా ఉండగా.. అదే గ్రామ పంచాయతీలో ఓ మహిళ నదిలో కొట్టుకుపోయి మృతి చెందింది. ఎర్రగుట్ట గ్రామానికి చెందిన 55 ఏళ్ల భీంబాయి తన గ్రామ సమీపంలోని వాగు దాటేందుకు ప్రయత్నించింది. కానీ భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వాగు మధ్యలోకి వచ్చిన ఆమె ప్రవాహ వేగానికి తట్టుకోలేక అందులో కొట్టుకుపోయింది. ఈ వాగు ప్రవహించే పక్క గ్రామంలో భీంబాయి మృతదేహం కనిపించింది.
Tea: లేచిన వెంటనే టీ తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి