Leading News Portal in Telugu

Hyderabad Rains : హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..


హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. నార్సింగ్‌, బండ్లగూడ, కాటేదాన్‌, గండిపేటలో భారీ వాన కురిసింది. రాజేంద్రనగర్‌లో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నగరంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. వాతావరణ శాఖ నగరంలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తదితర హెచ్చరికలు జారీ చేసిన శాఖ.. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

వాతావరణ శాఖ ప్రకారం, హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్‌లు – చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి – సెప్టెంబర్ 27 వరకు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. తన కచ్చితమైన అంచనాలకు ప్రసిద్ధి చెందిన వాతావరణ ప్రియుడు టి. బాలాజీ కూడా హైదరాబాద్‌లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షం పడుతుందని అంచనా వేశారు. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) డేటా ప్రకారం, నగరంలో నిన్న ఎటువంటి వర్షపాతం లేదు. ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలో సాధారణ వర్షపాతం 708.8 మిల్లీమీటర్లు దాటి 828.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 580.8 మి.మీ కంటే ఎక్కువగా 722.7 మి.మీ నమోదైంది.