బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఏదో అవగాహన ఉందనే కుట్రపూరిత ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తోందన్నారు తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ ప్రకాశ్ జావదేకర్. ఇవాళ ఆయన ఢిల్లీలో ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వాస్తవానికి, బిజేపి పై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగేలా, బిఆర్ఎస్, కాంగ్రెస్ లే లోపాయుకారిగా కలిసి పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ని అరెస్ట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంతకు ముందు బండి సంజయ్ ను కూడా నిర్బందించింది. కేసులు పెడుతోందన్నారు. ఇది నాటకం ఎలా అవుతుంది….అలా అనడం పూర్తిగా అబద్ధమన్నారు. అంతేకాకుండా.. ‘కేసీఆర్ కుటుంబపాలనకు స్వస్తి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు మా వైపే ఉన్నారు. మీరే చూస్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపుకు వెళ్ళిందనేది నిజం కాదు. క్షేత్రస్థాయిలో బిజేపి బలంగా ఉంది.
ఎన్నికలకు బీజేపీ శ్రేణులన్నీ సమాయత్తం అవుతున్నాయు. ఓ వారంలో మొదటి విడత అభ్యర్ధుల జాబితాను ప్రకటించబోతున్నాం. అక్టోబర్ 1 నుంచి తెలంగాణ లో బిజేపి వరుసగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ప్రధాని మోడి తో సహా, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి సీనియర్ నేతలంతా తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు. పేదరికం నుంచి వచ్చిన ప్రధాని మోడి పేదప్రజల కోసం ఎంతో చేస్తున్నారు. పేద ప్రజలు, వెనుకబడిన వర్గాల ప్రజలు ప్రధాని మోడీని తమవాడిగా భావిస్తున్నారు. ప్రతి పేద కుటుంబానికి లభించే ఉచిత బియ్యం మోడి ప్రభుత్వం ఇచ్చినవే. రానున్న 60 రోజుల్లో తెలంగాణలో ఏం జరగబోతోందో మీరే చూస్తారు. రాజకీయాలలో 60 రోజులంటే చాలా ఎక్కువ. మాదగ్గర అనేక అస్త్రాలున్నాయు…. వ్యూహాలు ఉన్నాయి. మీరే చూస్తారు. వచ్చే రెండునెలలు హైదరాబాద్ లోనే ఉంటాను. 26 వేల పోలింగ్ కేంద్రాల్లో (బూత్ లు) బీజేపీ కార్యకర్తలు నిరంతరం పనిచేస్తున్నారు. ‘ అని ప్రకాశ్ జావదేకర్ అన్నారు.