Leading News Portal in Telugu

Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై షాక్


తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించింది. గత కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను తమిళిసై తిరస్కరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన దాసోజు, మాజీ ఎమ్మెల్యే కుర్రాలను ప్రతిపాదిస్తూ తెలంగాణ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ పేర్లను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించిది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై తిరస్కరించింది.

వీరిద్దరి పేర్లను తిరస్కరించడానికి గల కారణాలను కూడా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ చెప్పారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే వారు ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా వెల్లడి కాలేదు అని తెలంగాణ గవర్నర్ అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్న వారిని మాత్రమే సిఫార్సు చేయాలని తమిళిసై మరోసారి సూచించారు.