రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు (మంగళవారం) సాయంత్రం కొల్చారం మండలానికి చెందిన యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టారు. రవీందర్, శ్రీకాంత్, సురేష్ గౌడ్, అన్వేష్, దిగంబర్ ఈ నిరసనకు దిగారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి మెదక్ వెళ్లే దారిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ పక్కనున్న సెల్ టవర్ ఎక్కి ఈ ఐదుగురు యువకులు నిరసన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చేంత వరకు సెల్ టవర్ నుంచి కిందకు దిగేది లేదని రెండు గంటల పాటు ఐదుగురు యువకులు హల్ చల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ షేక్ లాల్ మదర్, ఎస్సై శివ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని.. టవర్ నుంచి కిందికి దిగాలని సదరు యువకులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మదన్ రెడ్డికి తప్ప ఇతరులకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. మదన్ రెడ్డే కావాలి.. మదన్ రెడ్డే రావాలి అంటూ సెల్ టవర్ పైనే సదరు యువకులు నినాదాలు చేశారు.
అయితే, నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నర్సాపూర్‌తో పాటు మరో మూడు స్థానాల అభ్యర్థుల విషయంలో ఎటూ తేల్చకుండా పెండింగ్‌లో పెట్టారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మధ్య ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. సీఎం మెదక్ పర్యటన తర్వాతే నర్సాపూర్ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉంది. వయోభారంతో మదన్‌రెడ్డికి ఈసారి టికెట్ దక్కే అవకాశాలే లేవని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.