కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఫిట్ అని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ ఫిట్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్ గా తమిళి సై సౌందరరాజన్ అన్ ఫిట్ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు డీకే అరుణ ఆయనపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ నోటికి వచ్చినట్లు.. మహిళ గవర్నర్ అని కూడా చూడకుండా మాట్లాడం వారి దొరతనానికి నిదర్శనమని డీకే అరుణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని దేశ విదేశాల్లో ఉన్న వారు ప్రశంసిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వానికి అవేవీ కనిపించడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. 140 కోట్ల ప్రజల గొంతుకగ ఉన్న ప్రధాని మోడీని అనర్హుడు అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడమంటే, వారి నరనరాల్లో బడుగు బలహీనర్గాలపై ఎంత అక్కస్సు ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలని డీకే అరుణ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరారు. కల్వకుంట్ల కుటుంబం, ముఖ్యమంత్రి కుమారుడు నోటికి వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీ కుటుంబం భరతం పడతారని డీకే అరుణ హెచ్చరించారు. ఖబడ్దార్ కేటీఆర్, ప్రధాన మంత్రి పేరు పలికే నైతిక హక్కు మీ ముఖాలకు లేదు అంటూ ఆమె మండిపడ్డారు. బీజేపీ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ.. ఊరుకునే ప్రసక్తి లేదని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.