Minister Jagadish Reddy: తమిళిసై గవర్నర్ అయ్యే టైంకి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు..
ఎమ్మెల్సీ తిరస్కరణ అంశంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. గవర్నర్ తమిళిసై తప్పుడు నిర్ణయం తీసుకుని సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.. ఆమె గవర్నర్ అయ్యే సమయానికి తమిళనాడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు అంటూ ఆయన మండిపడ్డారు. ప్రకటన తరవాత బీజేపీకి రాజీనామా చేశారు.. బీజేపీ నుంచి గవర్నర్ గా వచ్చి ఎదుటి వారిని పార్టీ పేరుతో తిరస్కరించడం సమంజసం కాదు.. గవర్నర్ తమిళిసై తీరు గురువింద తీరుని తలపిస్తుంది.. గవర్నర్ చెప్పే లెక్క ఆమెకూ వర్తిస్తుంది.. నీతులు చెప్పే గవర్నర్ నైతిక విలువలు పాటిస్తారని ఆశిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.
ఇక, అంతకు ముందు మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ సాహసమే తెలంగాణ సమాజానికి స్పూర్తి.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చూపించిన తెగువ ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిందని ఆయన అన్నారు.
తమ హక్కుల కోసం కొట్లాడే వారికి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతుంది.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి.. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో ఐలమ్మ పోరాట స్ఫూర్తితో అధిగమించాలని ఆయన సూచించారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ పోరాటయోధులకు సముచిత గౌరవం లభించిందన్న మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఐలమ్మ ఆశయాలను నెరవేర్చడమే ఆమెకు మనమంతా ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు.