ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్న మోడీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని మోడీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లో చేయాల్సిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మహబూబ్ నగర్ కి మార్పు చేశారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు కాకుండా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో మోడీ లాండ్ కానున్నారు.
అక్టోబర్ 1న మధ్యాహ్నం 1.30 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మోడీ చేరుకుంటారు. 1:35 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి హెలిక్యాప్టర్ లో మహబూబ్ నగర్ కి బయలు దేరుతారు. 2:10 మహబూబ్ నగర్ కు చేరుకోనున్న మోడీ.. 2.15 నుండి 2.50 వరకు అభివృద్ధి కార్యక్రమాల శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. 3 గంటల నుండి 4 గంటల వరకు బహిరంగ సభ, 4.10 నిమిషాలకు మహబూబ్ నగర్ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో శంషాబాద్ కి వస్తారు. 4.50 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ మోడీ తిరుగుప్రయాణం కానున్నారు.
ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమరభేరీ సభలో పాల్గొని.. ఈ సభావేదిక నుంచే ఎన్నికల శంఖారావాన్ని మోడీ పూరించనున్నారు. ఆ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహార శైలిపై ధ్వజమెత్తనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రధాని సభలకు భారీ జన సమీకరణపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మహిళా బిల్లు ఆమోదం నేపథ్యంలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా పరిశీలిస్తుండగా.., మహబూబ్‌నగర్‌లో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పర్యవేక్షిస్తున్నారు.