నల్గొండ జిల్లా కేంద్రంలో హనుమాన్ నగర్ మొదటి విగ్రహా పూజల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్టి ద్వారా 70 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పోటీ పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించలేని అసమర్ధ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన విమర్శలు గుప్పించారు. నేటితో రాష్ట్ర ప్రజల విఘ్నాలు తొలగిపోవాలని వినాయకుడిని కోరుకున్నా అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను నెరవేర్చుతామన్నారు. ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ బేషరతు మద్దతు ఇచ్చిందని, 66 మంది బీజేపీ ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో పార్లమెంట్ కార్యక్రమాలకు హాజరు కాలేకపోయామని ఆయన చెప్పారు. బిల్లు మాది అని సోనియాగాంధీ స్పష్టంగా చెప్పినప్పటికీ కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేసేలా కిషన్‌రెడ్డి ప్రకటనలు ఇస్తున్నారని అన్నారు.