ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నిమజ్జన శోభాయాత్రను మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి చేయాలనే లక్ష్యంతో పోలీసు అధికారులు ఉత్సవ్ కమిటీని ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభించాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం, ఊరేగింపు ప్రారంభమైంది. 63 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని ఉదయం 5 గంటలకు ట్రాలీపై ఉంచారు. శోభాయాత్ర కోసం అధునాతన క్రేన్లను వినియోగిస్తున్నారు. 26 టైర్లతో కూడిన ట్రాలీ 55 టన్నుల బరువును మోయగలదు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ బుధవారం రాత్రి గణేష్ దర్శనాన్ని నిలిపివేసి ట్రాలీ వెల్డింగ్ పనులను ప్రారంభించింది. అయితే.. ఉదయాన్నే ప్రారంభమైన మహా గణపతి శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. అయితే.. గణేశుడి నిమజ్జనం ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనం సాఫీగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసాం.. నిమజ్జన కార్యక్రమం సవ్యంగా సాగుతోందన్నారు. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని షెడ్యూల్ ప్రకారమే నిమజ్జనం చేస్తున్నామని, బాలాపూర్ గణనాథుడు మధ్యాహ్నం వరకు చార్మినార్ కు చేరుకునే అవకాశం ఉందన్నారు మంత్రి తలసాని. రేపు ఉదయం వరకు నిమజ్జనం కొనసాగుతుందని మంత్రి తలసాని వెల్లడించారు. నిమజ్జన సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, వినాయక నిమజ్జనం చూడడానికి లక్షలాదిమంది తరలివస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుకు తగినట్లు ఏర్పాటు చేశామని, వినాయక శోభాయాత్రను సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిరక్షిస్తున్నామన్నారు. గణనాథులను త్వరగా నిమజ్జనం అయ్యేలా చూడడం మా ఉద్దేశం కాదు.. ఎవరు ఎప్పుడు వచ్చినా నిమజ్జనం చేసుకోవచ్చుని.. ప్రజల భద్రతను దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.