Leading News Portal in Telugu

MIM vs BJP Clash: బండి సంజయ్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత.. ఎంఐఎం వర్సెస్ బీజేపీ..


కరీంనగర్ లో బండి సంజయ్, ఆయన ఎంపీ కార్యాలయం దగ్గర ఎంఐఎం కార్యకర్తల హాల్ చల్ చేశారు. ఎంఐఎం జెండాలతో 50కి పైగా బైక్ లపై కార్యకర్తలు ర్యాలీగా వచ్చి.. బీజేపీకి, బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఎంఐఎం కార్యకర్తలు అక్కడి నుంచి జారుకున్నారు. కాసేపటి తరువాత మళ్లీ వచ్చి ఎంపీ కార్యాలయం బోర్డును కొడుతూ బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎంఐఎం కార్యకర్తల తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గల్లీల్లో ర్యాలీకి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. హిందుత్వంపై దాడికి కుట్ర జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తల సమాచారంతో ఎంపీ కార్యాలయానికి పోలీసులు చేరుకున్నారు. సంఘటన వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇక, రోడ్డు పైకి కర్రలతో బీజేపీ కార్యకర్తలు బయలుదేరి వచ్చారు. కరీంనగర్ లోని బండి సంజయ్ ఎంపీ ఆఫీస్ పై దాడి చేసేందుకు ప్రయత్నించిన కొందరిని కట్టెలతో బీజేపీ కార్యకర్తలు తరిమికొట్టారు.. కిలోమీటర్ పరిగెత్తించారు. ఇక, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

ఇక, విషయం తెలుసుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు రంగంలోకి దిగాడు. ఇద్దరు ఏసీపీలు, ఆరుగురు సీఐల ఆధ్వర్యంలో కరీంనగర్ లో భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పోలీసులు చేశారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి ఇప్పటికే బీజేపీ కార్యకర్తులు భారీగా చేరుకుంటున్నారు. ఎంఐఎం కార్యకర్తల తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ ఘటనను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. శాంతి భద్రతలను కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు పర్యవేక్షిస్తున్నాడు.