Leading News Portal in Telugu

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. నేడే సైకిల్ ట్రాక్ ప్రారంభం


విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌లో ప్రజలకు మరిన్ని మౌళిక వసతులు కల్పించేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు అనేక ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం చేస్తుంది. అల పలు ఫ్లైఓవర్లు ఇప్పటికే పూర్తై వాహనదారులకు అందుబాటులోకి వచ్చాయి.. మరికొన్ని ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉండగా.. ఇక నగరంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, సైక్లిస్టులను ప్రోత్సహించేందుకు హెచ్‌ఎండీఏ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో సైకిల్ ట్రాక్‌ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అధికారులు శ్రీకారం చుట్టారు.

అందులో భాగంగానే.. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు చేరువలో 100 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రతిష్టాత్మక సైకిల్‌ ట్రాక్‌ను ఇవాళ (ఆదివారం) సాయంత్రం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. దక్షిణ కొరియాలో ఉన్న సైకిల్‌ ట్రాక్‌ తరహాలో భారత దేశంలోనే ఆ స్థాయిలో తొలి సైకిల్‌ ట్రాక్‌ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు.

ఇక, కొల్లూరు నుంచి నార్సింగి వరకూ, నార్సింగి నుంచి తెలంగాణ పోలీస్‌ అకాడమీ వరకూ మొత్తం 23 కిలో మీటర్ల మార్గంలో ఈ ట్రాక్‌ను హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసింది. సైకిల్‌ ట్రాక్‌ పొడవునా సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైతం ఉంది. సోలార్‌ పలకల నుంచి వచ్చే విద్యుత్‌ను ట్రాక్‌ అవసరాల కోసం ఉపయోగించనున్నారు. ట్రాక్‌ పొడవునా అద్దె సైకిళ్లు, సైకిల్‌ రిపేరింగ్‌ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. రైడర్లు విశ్రాంతి తీసుకునేందుకు కెఫెటేరియా లాంటి వసతులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.