Prashanth Reddy: ఇందూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని పచ్చి అబద్దాల కోరు అని నిజామాబాద్ సభ ద్వార మరోసారి నిరూపించారన్నారు. కేటిఆర్ ని ముఖ్యమంత్రి చేయాలంటే నీ బోడి సహాయం ఎవరికి కావాలని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఎన్డీయేలో కలుస్తానని చెప్పారనడం పచ్చి అబద్దమని.. ఎన్డీయేలో కలవమని మీరు బ్రతిమిలాడితే దేశాన్ని అమ్మే వారితో కలవమని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
నిజామాబాద్ సభలో కేసీఆర్ పై.. ప్రధాని మోడీ నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గమని మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ పై ఎన్నికల వేళ అవినీతి ఆరోపణలు చేస్తున్న నీవు.. ఇన్ని రోజులు ఏం చేశావన్నారు. దర్యాప్తు సంస్థలన్నీ నీ జేబులోనే ఉన్నాయి కదా అని మంత్రి ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన ప్రధాని నరేంద్ర మోడీ.. కేసీఆర్ పై ఆరోపణలు చేయడం విడ్డూరమని ఆరోపించారు.
అంతకుముందు ఇవాళ జరిగిన ఇందూరు సభలో సీఎం కేసీఆర్ సీక్రెట్స్ ను ప్రధాని మోడీ బయటపెట్టిన విషయం తెలిసిందే. కేసీఆర్ NDAలో చేరతానని అడిగారన్నారు.. అంతేకాకుండా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తానని తనతో చెప్పారని ప్రధాని తెలిపారు.