Vijaya dairy: రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ విజయ ఫెడరేషన్‌కు చెందిన మెగా డెయిరీ ప్రారంభోత్సవానికి రెడీ అయింది. మహేశ్వరం మండలం రావిర్యాలలో రూ.250 కోట్లతో 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా డెయిరీని నిర్మించారు. దీని నిర్వహణకు ప్రత్యేకంగా సోలార్ సిస్టమ్‌తో పాటు వ్యర్థాల వినియోగం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఏర్పాట్లు చేశారు. నేటి మధ్యాహ్నం ఈ మెగా డెయిరీని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ సహకారంతో దేశంలోనే అత్యాధునిక, పూర్తి ఆటోమేటిక్ మిషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో నిర్మించబడింది. ఈ డెయిరీకి రోజుకు 5 లక్షల నుంచి 8లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉంది.
ఈ మెగా డెయిరీ ద్వారా రోజుకు పాల ఉత్పత్తి సామర్థ్యం ఈ విధంగా ఉంది.
– మిల్క్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ – 5 లక్షల నుండి 8 లక్షల లీటర్లు
– పాల ఉత్పత్తి – లక్ష లీటర్లు టెట్రా బ్రిక్
– నెయ్యి ఉత్పత్తి – 10 టన్నులు
– ఐస్ క్రీమ్ – 5 వేల నుండి 10 వేల లీటర్లు
– పెరుగు ఉత్పత్తి – 20 టన్నులు
– మజ్జిగ, లస్సీ తయారీ – 12 వేల లీటర్లు
– వెన్న తయారీ (నెలకు) – 30 టన్నులు
ఈ మెగా డెయిరీ ఏర్పాటు డెయిరీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు మూతపడే స్థితిలో ఉన్న విజయ డెయిరీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ లాభాల బాట పట్టించారన్నారు. ప్రస్తుతం ఉన్న పాల ఉత్పత్తులతో పాటు కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొచ్చామన్నారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై పాడి గేదెల పంపిణీ, గడ్డి విత్తనాలు సరఫరా చేస్తున్నామని ప్రకటించారు. విజయ డెయిరీకి పాలు సరఫరా చేసే రైతులకే కాకుండా ఇతర సహకార డెయిరీలకు చెందిన రైతులకు కూడా లీటరు పాలకు రూ.4 చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేస్తామన్నారు.