Leading News Portal in Telugu

Cyber Crime: టాస్క్ పేరిట.. జగిత్యాల యువకుడికి 3.17 లక్షలు టోకరా!


Jagtial Young Man Venkat Sai Was Cheated by Cyber Criminals: సైబర్ కేటుగాళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నిత్యం ఓ అడుగు అడ్వాన్స్‌గా ఉంటూ.. అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా అమాయకులకు ఎరవేసి.. వారి కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్ల తెలివికి.. అమాయకులు మాత్రమే కాదు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్స్ కూడా మోసపోతున్నారు. తాజాగా మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. టాస్క్ పేరిట ఓ యువకుడికి ఏకంగా రూ. 3.17 లక్షలు టోకరా పెట్టారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణినగర్‌కు చెందిన వెంకట్ సాయి అనే యువకుడికి గత నెల 23న వాట్సాప్‌కు సైబర్ కేటుగాళ్ల నుంచి ఓ మిస్డ్ కాల్ వచ్చింది. వెంకట్ సాయి తిరిగి కాల్ చేయగా.. సైబర్ కేటుగాళ్లు మాట్లాడారు. వాట్సాప్ ద్వారా టాస్క్ చేస్తే.. భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని అతడిని నమ్మించారు. అందుకు ముందుగా కాస్త డబ్బు చెల్లించాలని చెప్పారు. సైబర్ కేటుగాళ్ల మాయమాటలు నమ్మిన వెంకట్ సాయి.. ముందుగా కొంత డబ్బు పంపాడు.

వెంకట్ సాయి దశలవారీగా 3.17 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాలో జమ చేశాడు. అనంతరం సైబర్ నేరగాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. తాను మోసపోయానని గ్రహించిన వెంకట్ సాయి.. పోలీసులను ఆశ్రయించాడు. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో యువకుడు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.