గత కొన్ని రోజలుగా బీజేపీ నేత కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆ పార్టీని వీడుతున్నట్లు వార్తలు రావడంతో దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. నేను భారతీయ జనతా పార్టీ నుండి ఇతర పార్టీల్లోకి వెళుతున్నానంటూ కొన్ని పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానని అన్నారు. నేను వ్యక్తిగత స్వార్ధం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదని ఆయన వెల్లడించారు. ఈ దేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు నడిపించే శక్తి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి ఆమిత్ షా లకు ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంలో నేను, భాగస్వాములు కావాలని అడుగు వేశానని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా.. మునుగోడులో కేసీఆర్ ఆయన 100 మంది ఎంఎల్ఎలు మునుగోడులో సంసారాలు పెట్టినా..నా మీద. బీజేపీ మీద మునుగోడు ప్రజలు అచంచల విశ్వాసాన్నే చూపారని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఆయన అవినీతిని కక్కించి కుటుంబ తెలంగాణా బదులు ప్రజాస్వామిక, బహుజన తెలంగాణా ఏర్పాటు చేసే సత్తా ఒక్క బీజేపీకే ఉందని ఆయన మండిపడ్డారు. నేనే కాదు ఇతర ముఖ్య నాయకులెవరూ బీజేపీని వీడరని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించే దిశగా.. భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతున్నామని, భారత్ మాతాకీ జై..! అంటూ ఆయన వ్యాఖ్యానించారు.